

నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తణికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తెలుగు ఎక్స్‌పరిమెంట్స్ సాయి కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తణికెళ్ల భరణి మాట్లాడుతూ, పిల్లలందరూ కలిసి ఆనందంగా చూసే మంచి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని, ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ పిల్లలకు మంచి సందేశాన్ని అందిస్తుందని అన్నారు. బాల నటుడు జయంత్ భవిష్యత్తులో మంచి నటుడిగా ఎదుగుతాడని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు. కేఎల్ దామోదర్ ప్రసాద్ పిల్లల చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. పిల్లల్లోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సూచించారు. నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఈ చిత్రాన్ని భావోద్వేగాలతో కూడిన కథగా అభివర్ణించగా, ప్రవీణ్ బొలిశెట్టి మంచి సంగీతం, సందేశం ఉన్న చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగులో ఈ సినిమా ‘తారే జమీన్ పర్’ తరహాలో గుర్తింపు పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆశిష్ గాంధీ తెలిపారు. జయంత్ నటనను దర్శకుడు నవీన్ దేశబోయిన ప్రశంసించారు. బాల నటుడు జయంత్, ఊహా రెడ్డి కూడా ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!