

బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ తన తాజా చిత్రం ‘టాక్సిక్’లోని ఇంటిమేట్ సన్నివేశాలపై వచ్చిన ట్రోలింగ్ గురించి తాజాగా స్పందించారు. ఈ విషయంలో తన భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఎలా స్పందించారో వెల్లడించారు. ఈ క్యూట్ కపుల్ ఇటీవల ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’ టాక్ షోలో పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో నటించడంపై వచ్చిన విమర్శల గురించి కియారా మాట్లాడుతూ.. సిద్ధార్థ్ ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదని, తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని తెలిపారు. తామిద్దరం ఈ ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోలేదని, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు తనను పెద్దగా బాధించలేదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో నటీమణులు ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం కొత్తేమీ కాదని, ఐశ్వర్య రాయ్‌తో పాటు గతంలో ఎంతోమంది ప్రముఖ నటీమణులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. తన వృత్తిపరమైన నిర్ణయాలపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు బహిరంగంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు అనిపించలేదని చెప్పారు.
మరోవైపు, యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్పందనను అందుకోకపోవడంపై కూడా కియారా మాట్లాడారు. సినిమా విడుదలైన తొలి వారాంతంలో వచ్చిన స్పందన తనను తీవ్రంగా నిరాశపరిచిందని, ఆ సమయంలో మానసికంగా బాధపడినట్లు వెల్లడించారు. అయితే, తనకు అలవాటైన పాత్రలకు భిన్నంగా కంఫర్ట్ జోన్ దాటి నటించినందుకు ప్రశంసలు రావడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని కియారా పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!