

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ రాజకీయ, సామాజిక అంశాలపై బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడించడం వల్ల ఆయన సినీ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడిందని భార్య, కొరియోగ్రాఫర్ పోనీ వర్మ తెలిపారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు సంధిస్తూ ఆయన సోషల్ మీడియాలో ‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో పోస్టులు పెడుతుంటారు. ఈ వైఖరి కారణంగా ప్రకాశ్‌రాజ్‌కు కొన్ని సినిమా అవకాశాలతో పాటు ప్రకటనల ప్రాజెక్టులు కూడా దూరమయ్యాయని ఆమె వెల్లడించారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోనీ వర్మ ఈ విషయాలను పంచుకున్నారు. తొలినాళ్లలో ప్రకాశ్‌రాజ్ రాజకీయ వ్యాఖ్యలు తనను ఆందోళనకు గురిచేసేవని చెప్పారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఘటన ఆయనను తీవ్రంగా కలచివేసిందని, ఆ తర్వాతే భయపడుతూ ఎన్నాళ్లు జీవించాలని ప్రశ్నించుకుని సామాజిక అంశాలపై బహిరంగంగా స్పందించడం ప్రారంభించారని తెలిపారు. ఈ కారణంగా కొందరు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆయనను సినిమాల నుంచి తప్పించిన సందర్భాలున్నాయని పోనీ వర్మ పేర్కొన్నారు. వృత్తిపరంగా నష్టపోయినప్పటికీ, తన మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించకూడదని ప్రకాశ్‌రాజ్ నిర్ణయించుకున్నారని ఆమె వివరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!