

విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అందులోని పాటల విషయంలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ మొత్తం ఎనిమిది పాటలు స్వరపరిచినట్లు జ్యూక్‌బాక్స్ ద్వారా వెల్లడైంది. అయితే థియేటర్లలో మాత్రం మూడు పాటలే కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముందుగా ప్రచారం చేసిన ‘మాలా’ పాటను సినిమా నుంచి తొలగించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారీ సెట్ వేసి, భారీ బడ్జెట్‌తో చిత్రీకరించిన ఈ పాటను లిరికల్ వీడియో రూపంలో విడుదల చేసి ప్రచారం కూడా నిర్వహించారు. అయితే పాట విడుదలైన సమయంలో సాహిత్యం, ట్యూన్ వెంకటేశ్ ఇమేజ్‌కు సరిపోవంటూ కొందరు అభిమానులు విమర్శలు చేసినట్లు కథనాలు వచ్చాయి. మరోవైపు ‘ఆదర్శ కుటుంబం’ కథా ప్రాధాన్యమున్న ఫ్యామిలీ డ్రామా కావడంతో పాటల వల్ల కథనం నెమ్మదించే అవకాశం ఉందని, సినిమా నిడివి, కథా గమనాన్ని దృష్టిలో ఉంచుకునే ‘మాలా’ పాటను ఎడిటింగ్‌లో తొలగించి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాటను తొలగించడానికి గల అసలు కారణంపై చిత్రబృందం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!