

‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ప్రస్తుతం వరుస సినిమాల ఫలితాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటించిన ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడు’, ‘భైరతి రణగల్’, ‘బగీరా’, ‘ఏస్’, ‘మదరాసి’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఆమె కథల ఎంపికపై చర్చ మొదలైంది. తాజాగా యష్ నటించిన ‘టాక్సిక్’కు కూడా ఆశించిన స్పందన రాకపోవడంతో రుక్మిణి పాత్రపై కొంతమంది ప్రేక్షకులు విమర్శలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాత్రను తీర్చిదిద్దిన విధానం, ఆమె నటనపై వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో ఇప్పుడు ఆమె తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తున్న ‘డ్రాగన్’పై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయిక కావడంతో ఈ పాన్ ఇండియా చిత్రంపై సహజంగానే భారీ క్రేజ్ ఏర్పడింది. ఇలాంటి సమయంలో ‘డ్రాగన్’ రుక్మిణి కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఎదురైన ఫలితాలను పక్కనపెడితే.. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంత బలంగా ఉంటుంది, దాన్ని ఎలా ప్రదర్శిస్తారన్నదే కీలకం కానుంది. సినిమా విజయం సాధిస్తే రుక్మిణి కెరీర్‌కు కూడా కొత్త ఊపు వచ్చే అవకాశముంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!