

మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ పనులే ప్రధాన కారణంగా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు రిలీజ్ డేట్‌పై చర్చ జరిగినప్పటికీ, పూర్తి స్థాయి వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదాలు తప్పడం లేదు. తాజాగా దసరా బరిలో సినిమాను విడుదల చేయనున్నారనే ప్రచారం జరగగా.. ఇప్పుడు ఆ అవకాశం కూడా దాదాపు లేనట్టేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘రణబాలి’ కూడా దసరా రేసులోకి రావడం ఆసక్తిని పెంచింది.
‘విశ్వంభర’ దసరాకు రావడం లేదనే స్పష్టత తర్వాతే ‘రణబాలి’ విడుదలపై ప్రకటన వెలువడిందనే ప్రచారం వినిపిస్తోంది. దీంతో రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’తో ఉండే పోటీ నుంచి ‘విశ్వంభర’ తప్పుకున్నట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరమయ్యే సినిమా కావడంతో నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను పూర్తి చేసిన తర్వాతే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!