

భారత్‌లో విద్యుత్ వాహనాల (ఈవీ) మార్కెట్ రానున్న రోజుల్లో భారీగా విస్తరించనుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2030 నాటికి దేశీయ ఈవీ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని, అదే సమయంలో ఈ రంగం సుమారు ఐదు కోట్ల ఉద్యోగాలను సృష్టించగలదని పేర్కొన్నారు. సీఐఐ-ఐటీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 57 లక్షల ఈవీలు రిజిస్టర్ కాగా, మొత్తం వాహన మార్కెట్‌లో వాటి వాటా 7 శాతంగా ఉందన్నారు.
దేశంలో ఏటా లక్ష ఈవీ బస్సులకు డిమాండ్ ఉండగా, ప్రస్తుతం 50,000 నుంచి 60,000 బస్సులను మాత్రమే తయారు చేయగలుగుతున్నామని గడ్కరీ తెలిపారు. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థలు తమ ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇది సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ అసాధ్యం కాదని గడ్కరీ స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!