

బాలీవుడ్ దిగ్గజ నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు, నటుడు-దర్శకుడు సునీల్ ఆనంద్ జూలై 26న లండన్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఆయన మేనకోడలు గీనా నారంగ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ధ్రువీకరించారు. ఈ వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ ప్రముఖులు సునీల్ ఆనంద్ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులర్పించారు.
సునీల్ ఆనంద్ తన తండ్రి దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'ఆనంద్ ఔర్ ఆనంద్' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. అనంతరం 'కార్ థీఫ్', 'మైన్ తేరే లియే' వంటి చిత్రాల్లో నటించారు. అయితే తండ్రి స్థాయిలో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయారు. దర్శకత్వంపై ఆసక్తితో 'మాస్టర్' చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన, చివరిసారిగా 'వాగేటర్ మిక్సర్' అనే హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అందులో నటించారు. 2015 తర్వాత ఆయన సినీ రంగానికి దూరంగా ఉన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!