

టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో గుర్తింపు తెచ్చుకుంటున్న నటి భాగ్యశ్రీ బోర్సే తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను తాజాగా పంచుకుంది. తెరపై కనిపించే విజయాల వెనుక ఎన్నో అవమానాలు, నిరాకరణలు దాగి ఉంటాయని ఆమె తెలిపింది. సినిమాల్లోకి రావాలన్న తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తొలుత అంగీకరించలేదని, ప్రోత్సాహం ఇవ్వడం కంటే వ్యతిరేకతనే ఎక్కువగా ఎదుర్కొన్నానని చెప్పింది. తన కలను అర్థం చేసుకోలేక కొందరు బంధువులు దూరమయ్యారని, చివరకు వాట్సాప్‌లో కూడా బ్లాక్ చేసిన సందర్భాలు ఎదురయ్యాయని గుర్తు చేసుకుంది. ఆ పరిస్థితులు మానసికంగా బాధించినా తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వదల్లేదని వెల్లడించింది.
తన కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచాలన్న సంకల్పమే ముందుకు సాగేందుకు బలాన్నిచ్చిందని భాగ్యశ్రీ పేర్కొంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా కష్టపడటమే తన విజయానికి కారణమైందని చెప్పింది. ప్రస్తుతం అఖిల్ నటించిన 'లెనిన్' సినిమాతో మంచి గుర్తింపు లభించడంతో గతంలో ఎదుర్కొన్న కష్టాలన్నింటికీ ఫలితం కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేసింది. అప్పట్లో ఎదురైన నిరాకరణలే ఇప్పుడు తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని, ప్రస్తుతం తన జీవితంలో ఎంతో సంతోషకరమైన దశను ఆస్వాదిస్తున్నానని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!