

సంతోష్ దావఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ చిత్రం ‘గొంధల్’ 99వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 33 చిత్రాల నుంచి ‘గొంధల్’ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ భారత్ ఆస్కార్ ఎంపిక ప్రక్రియపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ‘ది లంచ్‌బాక్స్’, ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ వంటి చిత్రాలను గతంలో అధికారిక ఎంట్రీలుగా పంపే అవకాశాలను భారత్ కోల్పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. సెలక్షన్ ప్రక్రియలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే మంచి అవకాశాలు చేజారుతున్నాయని ఆయన విమర్శించారు.
గతేడాది భారత్ తరఫున ఆస్కార్‌కు వెళ్లిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం టాప్ 15 షార్ట్‌లిస్ట్‌లో చోటు సంపాదించడం సానుకూల పరిణామమని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘గొంధల్’ ఆస్కార్ ప్రచారంలో భాగంగా భారత్ వెలుపల జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొనడం, అమెరికా డిస్ట్రిబ్యూటర్లను సంపాదించడం ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. అంతర్జాతీయ ఫెస్టివల్, పంపిణీ వ్యూహం లేకుండా కేవలం ప్రచారం కోసం భారీగా ఖర్చు చేయడం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఐఎఫ్‌ఎఫ్‌ఐ వంటి వేదికల్లో గుర్తింపు పొందిన ప్రాంతీయ చిత్రాలను అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు తీసుకెళ్లేందుకు ఎన్‌ఎఫ్‌డీసీ ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!