

బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించిందంటూ లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ కృత్రిమ మేధ సంస్థపై ఆమె టీమ్ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది. ఉర్వశి గుర్తింపు, దృశ్యాలను అనుమతి లేకుండా ఉపయోగించడం ద్వారా ఆ సంస్థ భారీ వాణిజ్య విలువను సృష్టించిందని ఆమె టీమ్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో నష్టపరిహారంగా ప్రస్తుతం రూ.7,000 కోట్లను అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. అయితే సంబంధిత సంస్థ పేరు, న్యాయపరమైన చర్యల పూర్తి వివరాలను ఉర్వశి టీమ్ వెల్లడించలేదు.
కృత్రిమ మేధ సంస్థలు తమ వ్యాపారాన్ని, బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోవచ్చని, అయితే ఉర్వశి పేరు, ఫొటోలు, వీడియోలు లేదా గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాల్లో ఉపయోగించరాదని ఆమె టీమ్ హెచ్చరించింది. కృత్రిమ మేధ ద్వారా ప్రముఖుల ఫొటోలు, వీడియోలు, గొంతులను ఉపయోగించి కంటెంట్ రూపొందించడం పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ ఉర్వశి తనను ఐశ్వర్యరాయ్ బచ్చన్, దీపికా పదుకొణె ముందు మోకాళ్లపై ఉన్నట్లు చూపించిన కృత్రిమ మేధ రూపొందించిన చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!