

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దర్శకుడు కొల్లి బాబి తెరకెక్కిస్తున్న ‘కాకా’తో పాటు వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’, శ్రీకాంత్ వదలతో మరో ప్రాజెక్ట్ ఆయన ఖాతాలో ఉన్నాయి. వీటితో పాటు వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు వెంకీ అట్లూరితో కూడా చిరంజీవి సినిమా ఉంటుందనే వార్తలు గతంలో వినిపించాయి. ఈ కాంబినేషన్‌పై వెంకీ అట్లూరి కూడా సానుకూలంగా స్పందించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన మరో ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. తమ కాంబినేషన్‌లో సినిమా రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి కోసం తాను ఈ కథపై మరింత సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సాధారణంగా తన సినిమాల తరహాలో కాకుండా పూర్తిస్థాయి మెగాస్టార్ చిత్రంగా దీనిని రూపొందిస్తానని హామీ ఇచ్చారు.
వెంకీ అట్లూరి ఇప్పటివరకు తీసిన సినిమాల్లో కథ, భావోద్వేగాలు, వినోదానికి ప్రాధాన్యం కనిపించింది. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయాలంటే ఆయన స్థాయికి తగ్గ కథను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉందని దర్శకుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తొందరపడకుండా మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. చిరంజీవి ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే వెంకీ అట్లూరి చెప్పిన మాటలు మాత్రం అభిమానుల్లో అంచనాలను పెంచుతున్నాయి. తన గత చిత్రాల మాదిరిగా కాకుండా చిరంజీవి ఇమేజ్, స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా పక్కా మెగాస్టార్ సినిమాను అందిస్తానని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!