

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా సమర్పకులుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగాతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’ కోసం తామిద్దరం ఒక యుద్ధంలా పనిచేశామని, ఆ సమయంలో ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే తమ బంధానికి కారణమని చెప్పారు. ‘రోమాంచకం’తో సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘అర్జున్ రెడ్డి’తో తనకు, విజయ్ దేవరకొండకు లభించిన అనుభూతి దర్శకుడు వేణుతో పాటు ‘రోమాంచకం’ చిత్రబృందానికి కూడా కలగాలని ఆకాంక్షించారు. తాను పేరుకే సమర్పకుడినని, సినిమా కోసం తన అన్న ప్రణయ్ రెడ్డి వంగా, ఇతర చిత్రబృందం ఎంతో శ్రమించిందని తెలిపారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ మరోసారి ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సందీప్ రెడ్డి వంగా నిర్మాణంలో సినిమా చేయడం తనకు గర్వంగా ఉందని, ‘రోమాంచకం’ తన కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. సినిమాలోని పాత్రలు, వాటి అమాయకత్వం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెహర్ రమేశ్, శౌర్యువ్, సునీల్ నారంగ్ తదితర సినీ ప్రముఖులు, చిత్రబృందం పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!