

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ట్రైలర్‌ను భీమవరంలో గ్రాండ్‌గా నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు మంచి స్పందన రావడంతో ట్రైలర్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్‌లో రవితేజ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, భార్య, కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిగా కనిపించారు. తన గ్రామంలోని అమ్మాయిలను కూడా కూతుళ్లుగా భావించే ఆయనకు అన్యాయం జరిగితే రక్షణ భావం తీవ్ర ఆగ్రహంగా మారుతుంది.
ట్రైలర్‌లో రవితేజ పాత్రకు మరో ఆసక్తికరమైన కోణాన్ని చూపించారు. మద్యపానానికి అలవాటు ఉన్నప్పటికీ ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరించే ఆయన.. దీక్ష సమయంలో పూర్తిగా ప్రశాంతమైన, భిన్నమైన వ్యక్తిగా మారతాడు. ఈ సమయంలో ఆయన జీవితంలోకి అమ్మాయిల వరుస హత్యలు రావడంతో అసలు హత్యలకు కారణం ఎవరు? నిందితుడిని ఎలా అడ్డుకున్నాడు? అనే అంశాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. శివ నిర్వాణ తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో మిళితం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రియా భవానీ శంకర్ రవితేజ భార్య కావేరి పాత్రలో నటించగా, బేబీ నక్షత్ర తండ్రి-కూతురు బంధంలో కీలకమైన భావోద్వేగాన్ని తీసుకొచ్చింది. సాయి కుమార్ గురుస్వామి పాత్రలో, స్వాసిక నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సినిమాకు బలంగా నిలిచాయి.
రవితేజ మాట్లాడుతూ, భీమవరంతో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని, తన జీవితంలో దాదాపు ఎనిమిది నెలలు అక్కడ సినిమాలు చూస్తూ గడిపానని గుర్తుచేసుకున్నారు. భీమవరం వైబ్, అక్కడి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఇరుముడి’ ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుతూ భీమవరం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
శివ నిర్వాణ మాట్లాడుతూ, భీమవరంలో ‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉందని, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ట్రైలర్‌లో చూపించిన దానికంటే పదింతలు ఎక్కువ ఎమోషన్ సినిమాలో ఉంటుందని తెలిపారు. తండ్రి–కూతురు బంధం, అయ్యప్ప స్వామి–భక్తుడి అనుబంధం, క్రైమ్ చిక్కుముడి అనే మూడు అంశాలను కలిపి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించామని, సినిమా ఇంటెన్సిటీ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుందని అన్నారు. ‘ఇరుముడి’ కేవలం సినిమా కాదని.. ఒక గొప్ప ఎమోషన్ అని పేర్కొన్నారు.
రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, రవితేజ తన కజిన్ అని, ఎలాంటి సహాయం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన రియల్ హీరో అని ప్రశంసించారు. తమ జిల్లా వ్యక్తి మాస్ మహారాజాగా ఎదగడం, ఈ వేడుకకు రావడం తనకు ఎంతో గర్వంగా, గుర్తుండిపోయే సందర్భమని అన్నారు. పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి ఎందరో ప్రముఖ హీరోలు వచ్చి సినీ రంగంలో రాణించారని గుర్తుచేశారు. ‘ఇరుముడి’ ట్రైలర్ అద్భుతంగా ఉందని, ఈ సినిమా రవితేజకు మరో పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ, భీమవరం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ‘కావేరి’ పాత్రను ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణకు కృతజ్ఞతలు చెబుతూ, బేబీ నక్షత్ర ఎంతో ప్రతిభావంతురాలని, ఆమె నటన ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు. నిర్మాతలు రవి, నవీన్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్మించారని ప్రశంసించారు. రవితేజతో కలిసి పనిచేయడం తనకు చాలా ప్రత్యేకమైన అనుభవమని, ‘ఇరుముడి’ ఆయన కెరీర్‌లో మోస్ట్ మెమొరబుల్ ఫిల్మ్ అవుతుందని, అందులో హీరోయిన్‌గా నటించడం తనకు మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు.
బేబీ నక్షత్ర మాట్లాడుతూ, ‘ఇరుముడి’ సినిమాలో భాగం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దర్శకుడు శివ నిర్వాణ తనకు ఎంతో సపోర్ట్ చేశారని, ఇంత మంచి అవకాశం ఇచ్చిన రవితేజకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రియా భవానీ శంకర్ కూడా తనకు ఎంతో సహకరించారని పేర్కొన్నారు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ, ప్రేక్షకులు సినిమాను చూసి మొత్తం చిత్రబృందాన్ని ఆశీర్వదించాలని కోరారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ, భీమవరంలో ‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భీమవరంలో ఈవెంట్ నిర్వహించాలని అనుకున్న వెంటనే రవితేజ అంగీకరించారని, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, డ్రామా, ఎమోషన్ వంటి అంశాలను అద్భుతంగా పలికించగల రవితేజ ఈ కథకు సరైన హీరో అని భావించామని చెప్పారు. ప్రియా భవానీ శంకర్ మిడిల్ క్లాస్ భార్యగా అద్భుతంగా నటించారని, సినిమా చాలా బాగా వచ్చిందని, ఇది పెద్ద స్థాయికి వెళ్తుందని నమ్ముతున్నామని తెలిపారు. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్ కూడా అద్భుతంగా జరుగుతోందని, ప్రభాస్ ‘ఇరుముడి’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారని వెల్లడించారు. ఆగస్టు 21న ప్రేక్షకులంతా థియేటర్లలో ‘ఇరుముడి’ని చూడాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!