

సినిమాలకు దాదాపు పదేళ్లుగా దూరంగా ఉన్న ప్రముఖ నటి, వైఎస్సార్‌సీపీ నేత ఆర్కే రోజా ‘అన్బే డయానా’ చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. పారి ఎలావళగన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్య రంగనాథన్ కథానాయికగా నటించారు. జూలైలో తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఆగస్టు 28 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
‘అన్బే డయానా’ కథ కృష్ణ అనే మధ్యతరగతి యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఆంగ్లో ఇండియన్ యువతి డయానాతో కృష్ణ ప్రేమలో పడతాడు. అయితే డయానా స్వేచ్ఛగా జీవించే అమ్మాయి కావడంతో ఆమె జీవనశైలి కృష్ణ కుటుంబానికి భిన్నంగా ఉంటుంది. కృష్ణ తల్లి సరళ పాత్రలో ఆర్కే రోజా నటించారు. కొడుకు డయానాను ప్రేమించడాన్ని ఆమె వ్యతిరేకించి, తమ కులానికి చెందిన మరో అమ్మాయితో అతడి పెళ్లిని నిర్ణయిస్తుంది. మరి కృష్ణ తన ప్రేమ కోసం ఏం చేశాడు? అతడి ప్రేమ సరళ ఆలోచనల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేదే మిగతా కథ. ప్రేమ, కుటుంబ బంధాలు, సామాజిక భేదాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రోజా అభిమానులకు ఆమె రీఎంట్రీ మూవీగా ప్రత్యేకంగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!