

ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉంటే రాహుల్ గాంధీ జీవితాంతం మాక్ పార్లమెంటులోనే ఉండిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 1984 సిక్కుల ఊచకోత జరిగిన రోజునే రాంలీలా మైదానంలో సభ నిర్వహించడం బాధితుల గాయాలను మళ్లీ కెలికినట్లేనని విమర్శించారు. చండీగఢ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అబద్ధాలు ప్రచారం చేయడం, అరాచకాన్ని ప్రోత్సహించడం, పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడమే ప్రతిపక్షాల విధానమని ఆరోపించారు. 1984 నవంబర్ 1న వేలాది మంది సిక్కులు హత్యకు గురయ్యారని గుర్తుచేసిన అమిత్ షా, ఆ హింస వెనుక ఒక రాజకీయ పార్టీ ఉందని ఆరోపించారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులను తిరిగి తెరిచి, మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించిందని, హింసలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేతలను జైలుకు పంపిందని తెలిపారు.
మరోవైపు, విపక్షాల ‘చలో దిల్లీ’ సభను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ‘మూర్ఖపు నాటకం’గా అభివర్ణించారు. దిల్లీలో అశాంతిని సృష్టించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పండగ సీజన్‌లో వ్యాపారులు, దుకాణదారులకు నష్టం కలిగించడం, దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం ఈ ర్యాలీ వెనుక ఉద్దేశాలని ఆయన ఆరోపించారు. భారత్ బలమైన ప్రజాస్వామ్య దేశమని, రాజ్యాంగం, ప్రజల తీర్పు ఆధారంగానే పాలన సాగుతుందని, అల్లర్ల రాజకీయాలకు ఇక్కడ చోటు లేదని మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ర్యాలీ నేపథ్యంలో బీజేపీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరమయ్యాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!