

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కేసు నమోదైంది. స్థానిక శ్రీరామ్ సేన ధర్మార్థ సేవా సమితి సభ్యుడు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అమిత్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభా వేదికను శుద్ధి చేసిన ఘటనపై ఇటీవల రాజకీయ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ, వేదికను శుద్ధి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఖర్గే దళితుడు కావడం వల్లే ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.
అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తమ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదుదారు అమిత్ కుమార్ పేర్కొన్నారు. సభా వేదికను శుభ్రపరిచే కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలతో పాటు తాము కూడా పాల్గొన్నామని, దీనికి ఖర్గే కులంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కులం రంగు పులిమే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి అభియోగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తనపై నమోదయ్యే కేసులు తనకు ఛాతీపై పతకాల వంటివని రాహుల్ వ్యాఖ్యానించగా, ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్, గాంధీ కుటుంబంపై విమర్శలు చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!