

తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులను ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మూసీ నదిపై మూసారాంబాగ్‌లో నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. అంబర్‌పేటలో ప్రభుత్వ కార్యాలయాలు లేకపోవడంతో ప్రజలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. వర్షాలు కురిసినప్పుడు మూసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయేదని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ వంతెనను ఎందుకు నిర్మించలేకపోయిందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రెండేళ్లలోనే వంతెనను పూర్తి చేసిందన్నారు. అంబర్‌పేటలో 10 ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బతుకమ్మ కుంటను పేదలకు అంకితం చేశామని, చెరువుల ఆక్రమణలను తొలగిస్తున్నామని చెప్పారు. HYDRAAపై, తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. చెరువుల్లో విల్లాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మించింది తమ ప్రభుత్వం కాదని అన్నారు.
గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసే స్థాయికి చేరిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రిని 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది ప్రారంభిస్తామని వెల్లడించారు. సనత్‌నగర్ TIMSకు మర్రి చెన్నారెడ్డి, అల్వాల్ TIMSకు టి. అంజయ్య, ఎల్బీనగర్ TIMSకు కొండా లక్ష్మణ్ బాపూజీ, వరంగల్ TIMSకు ప్రొఫెసర్ జయశంకర్ పేర్లు పెట్టనున్నట్లు తెలిపారు. దేశంలో కులగణన నిర్వహించాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ ప్రభుత్వం నుంచి పొందుతున్న జీతం, భద్రత, నివాసం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం తదితర సదుపాయాల కోసం ఖర్చవుతున్న నిధులను కూడా రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్ వెంటనే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా కోరుతూ ప్రజలు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!