

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్, ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. ఎన్నికలు సమీపించిన సమయంలో పైలాన్ నిర్మించి ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు ప్రచారం చేశారని ఆరోపించారు. సోమవారం వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో భావోద్వేగంగా మాట్లాడిన ఆయన, తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆనందకరమైన క్షణాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ఈ చారిత్రక ఘట్టానికి హాజరుకావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబు పట్టుదల, దూరదృష్టితోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని మాగుంట కొనియాడారు. రెండున్నరేళ్లలో సుమారు రూ.2 వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు కేవలం రెండు నెలల వ్యవధిలోనే పునరావాస ప్యాకేజీ కింద రూ.900 కోట్లు అందించిన ఘనత కూడా చంద్రబాబుదేనని పేర్కొన్నారు. వెలిగొండ గడ్డపై కృష్ణా జలాలు ప్రవహిస్తున్న దృశ్యం తనను భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. చెన్నై నుంచి నేరుగా హెలికాప్టర్‌లో కార్యక్రమానికి చేరుకున్న మాగుంట, ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!