

పేదలకు సొంతింటిపై పూర్తి హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను పంపిణీ చేశారు. మొత్తం 399 ఎకరాలు, 19,33,853 చదరపు గజాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించి లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూముల విలువ సుమారు రూ.8,874 కోట్లుగా అంచనా వేశారు.
దశాబ్దాలుగా ఇళ్లపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ పట్టాలతో చట్టబద్ధమైన హక్కు లభిస్తుందని చంద్రబాబు అన్నారు. పట్టా పొందిన వారు తమ ఆస్తిపై హక్కులను వినియోగించుకోవడంతో పాటు బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంకా పట్టాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు కూడా త్వరగా హక్కులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విశాఖ భవిష్యత్తులో పర్యాటకం, లాజిస్టిక్స్‌కు కీలక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, పోలవరం ఎడమ కాలువ ద్వారా నగరానికి సాగునీరు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!