

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత పాలకవర్గంలో కీలక పదవులు నిర్వహించిన పలువురు మాజీ కార్పొరేటర్లు తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గతంలో గాజువాక నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా పనిచేసిన ఉరుకూటి చందు 87వ వార్డు నుంచి పోటీ చేసి తెదేపా అభ్యర్థి చేతిలో 292 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ కూడా 68వ వార్డులో తెదేపా అభ్యర్థి చేతిలో 62 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ తరఫున 52వ వార్డు నుంచి గెలిచిన ఆయన.. ఈసారి వార్డు మార్పుతో 68వ వార్డు నుంచి పోటీ చేశారు. ఆయన బంధువు సత్య 67వ వార్డులో పోటీ చేసి ఓడిపోయారు. మరో మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ భార్య సరళాదేవి 56వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. తెదేపా అభ్యర్థి కొల్లాబత్తుల ప్రసూన 713 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
గతంలో 32వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున, 44వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన మాజీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ కూడా తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈసారి జనరల్ కేటగిరీకి కేటాయించిన 54వ వార్డు నుంచి పోటీ చేసిన ఆయన.. భాజపా అభ్యర్థి పరశురామరాజు చేతిలో 1,026 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 58 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరడంతో వైఎస్సార్‌సీపీలో 32 మంది మాత్రమే మిగిలారు. తాజా ఎన్నికల్లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల మార్పుల నేపథ్యంలో పలువురు మాజీ కార్పొరేటర్లకు వేర్వేరు వార్డుల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఫలితాలు ఆ పార్టీకి నిరాశనే మిగిల్చాయి. మొత్తం 13 వార్డుల్లో మాత్రమే వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా.. అందులో మాజీ కార్పొరేటర్లు కేవలం నలుగురే ఉండటం గమనార్హం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!