

దేశంలోని ఎన్నికల వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి, బ్యాలెట్ పత్రాలతో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల దుర్వినియోగంతో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధమైనవి కావని ఆయన విమర్శించారు. కర్ణాటకలోని కలబురగిలో శనివారం విలేకర్లతో మాట్లాడిన ఖర్గే.. ప్రస్తుత ఎన్నికల విధానంతో ఎన్నికైన ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పదవులపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ఎన్నికల వ్యవస్థను మరింత బలహీనపరుస్తోందని ఖర్గే ఆరోపించారు. సెప్టెంబర్ 30న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో 20 పార్టీలు SIR ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశాయని, ముఖ్యంగా పేదలు, నిరక్షరాస్యులు, కార్మికులు, మైనారిటీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక వ్యవస్థలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చడాన్ని కూడా ఖర్గే తప్పుబట్టారు. ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణ కల్పించే నిబంధనలపైనా విమర్శలు చేశారు. ఈ అంశాలపై అక్టోబర్ 6 నుంచి దిల్లీలో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!