

ప్రపంచ కుబేరుడు, టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ తన సంపద, సోషల్ మీడియా వేదిక ఎక్స్ ప్రభావంతో అంతర్జాతీయ రాజకీయాల్లో తరచూ చర్చనీయాంశంగా మారుతున్నారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై ఆయన చేసే వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. 2024లో బ్రిటన్‌లో అల్లర్లు జరిగిన సమయంలో ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వంపై మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న కొన్ని ఖాతాలను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎక్స్‌కు వివాదం తలెత్తింది. తొలుత ఆ ఆదేశాలను వ్యతిరేకించిన మస్క్ సంస్థకు బ్రెజిల్‌లో నిషేధం ఎదురైంది. అనంతరం కోర్టు విధించిన నిబంధనలను పాటించి, జరిమానాలు చెల్లించడంతో వివాదం పరిష్కార దిశగా సాగింది.
జర్మనీ ఎన్నికలకు ముందు ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) పార్టీకి మస్క్ మద్దతు తెలపడం అక్కడ రాజకీయ చర్చకు దారితీసింది. కెనడా రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, కొన్ని ప్రావిన్సులు విడిపోవాలన్న సూచనలు కూడా విమర్శలకు కారణమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్‌లింక్ సేవలకు సంబంధించిన ఆయన నిర్ణయాలు సైనిక కార్యకలాపాలపై ప్రైవేటు టెక్నాలజీ సంస్థల ప్రభావం ఎంతవరకు ఉండాలనే ప్రశ్నను లేవనెత్తాయి. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తొలుత కలిసి పనిచేసిన మస్క్.. 2025లో ప్రభుత్వ వ్యయం, ఎలక్ట్రిక్ వాహనాల విధానాలు తదితర అంశాలపై ఆయనతో బహిరంగంగా విభేదించారు. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాలు, ప్రజాభిప్రాయం, అంతర్జాతీయ సంబంధాలపై టెక్నాలజీ దిగ్గజాల ప్రభావంపై చర్చను మరింత పెంచాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!