

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై పోలీస్ స్టేషన్‌లో ముసుగులు ధరించిన పోలీసులు దాడికి యత్నించారంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. పండగ రోజున విచారణ పేరుతో వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని, సాయంత్రం 6:30 గంటల సమయంలో సుమారు 15 మంది ముసుగులు ధరించిన పోలీసులు ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లి వారిపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ లీగల్ టీం ఈ ఘటనను గమనించి కేకలు వేస్తూ అడ్డుకోవడంతో ముసుగులు ధరించిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు.
ప్రభుత్వమే పోలీస్ స్టేషన్‌కు ముసుగులు ధరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులను పంపించి దాడికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ కేసులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ దాడికి యత్నించడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని ఆరోపించారు. హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఘటనపై స్పందించాలని, పోలీస్ స్టేషన్‌లోని పూర్తి సీసీటీవీ ఫుటేజ్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ముసుగులు ధరించి దాడికి యత్నించిన పోలీసులను గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టప్రకారం అరెస్ట్ చేయాలని కోరారు. పోలీస్ స్టేషన్‌లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అన్నదానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!