

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పంద్రాగస్టు ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ “420 మాటలే” అని విమర్శించారు. సంగారెడ్డికి వచ్చి ఒక్క రూపాయి హామీ కూడా ఇవ్వలేదని, జహీరాబాద్‌లో గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో కనీసం ఒక్క కిలోమీటర్ రోడ్డు అయినా నిర్మించారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, కానీ బహిరంగ సభల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదని సీఎం అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు తాను సిద్ధమని హరీశ్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, ఇప్పుడు 79 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని అన్నారు. ఈ అంశంపై సీఎం బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గన్‌మెన్ లేకుండా దిల్‌సుఖ్‌నగర్ కోచింగ్ సెంటర్, ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి రావాలని, లేదంటే విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!