

హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులను అవమానించారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం వేలాది మంది యువత తరలిరావడం నిరుద్యోగుల తప్పు కాదని, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైనందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులను అవమానించేలా అధికారులు మాట్లాడటం బాధాకరమని పేర్కొంటూ, ఉద్యోగాల కోసం వచ్చిన వారిని గౌరవంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని హరీశ్ రావు ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సక్రమంగా విడుదల కాకపోవడంతో పీజీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించిన యువత కూడా చిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వం నుంచి జాలి కోరడం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులపై అనుచితంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, వారిని అవమానించినందుకు విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!