

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ శాసన సభ్యులపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా చీరలు లాగడం, జుట్టు పట్టుకోవడం, గొంతులు పట్టుకోవడం వంటి దారుణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాల్లో ఉన్న రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
నిరసన తెలిపే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి పోలీసులను ఉపయోగించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు గతంలో పార్లమెంట్‌లో టీషర్టులు ధరించి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన సందర్భాలను ప్రస్తావిస్తూ.. రాహుల్‌గాంధీకి ఒక నిబంధన, తమకు మరో నిబంధన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 1,000 రోజుల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలు, హామీల అమలు తీరును సభలో ప్రశ్నిస్తామనే భయంతోనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు.
మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై హైకోర్టును ఆశ్రయించామని, ఈ అంశాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే బీఏసీ సమావేశాన్ని బహిష్కరించినట్లు చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించేందుకు కనీసం నెల రోజుల పాటు కొనసాగాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దళిత, గిరిజన డిక్లరేషన్లపై ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. దళితబంధు, ఇందిరమ్మ ఇళ్లు, అసైన్‌డ్ భూములు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా వంటి అంశాల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!