

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం కోసం దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వ ధోరణులకు మధ్య ప్రపంచవ్యాప్తంగా పోరాటం కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచి, అధికారాన్ని కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
భారత్ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులను ఆహ్వానించామని, అయితే వారిలో చాలామందికి కేంద్ర ప్రభుత్వం వీసాలు రద్దు చేసిందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులు సహా అన్ని వర్గాల హక్కులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, వైద్యం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఈ పోరాటానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని పేర్కొంటూ, ఆయనకు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. సంపన్నుల ప్రయోజనాల కంటే సామాన్య ప్రజల సంక్షేమానికే ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!