

బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. కవిత చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కవితను, కేసీఆర్‌ను కలిపేందుకు తాను ప్రయత్నించానని, వారిని విడదీయడానికి ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. ఈ విషయం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. తాను, తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే పార్టీతో కలిసి పనిచేశామని చెప్పారు. కష్టకాలంలో కేసీఆర్ వెంట నిలిచింది తానేనని పేర్కొంటూ.. కవిత ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులతో తాను ఎలాంటి మంతనాలు చేయలేదని, లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉండి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నానన్నారు. కాంగ్రెస్‌తో తాను చర్చలు జరపలేదని చెబుతున్న కవిత.. తాను కూడా కాంగ్రెస్ నేతలతో ఎలాంటి రహస్య చర్చలు చేయలేదని చెప్పగలరా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న నేతలను కవిత టార్గెట్ చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ ప్రారంభం నుంచి కొనసాగుతున్న జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, తనలాంటి నేతలపై ఆమె విమర్శలు చేయడం బాధ కలిగించిందన్నారు. తాను అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పారు. తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటం ఎవరికీ లాభం చేకూర్చదన్నారు. కవిత అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయ సానుభూతి పొందేందుకు చేసిన ప్రయత్నంగా భావించవచ్చని, అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడంలో తన పాత్ర ఏమిటో కేసీఆర్‌కు తెలుసని పేర్కొన్న ప్రశాంత్‌రెడ్డి.. ఇటీవల వరకు కవితను కేసీఆర్ బిడ్డగా గౌరవించానని, తాజా వ్యాఖ్యలతో ఆ గౌరవాన్ని ఆమె కోల్పోయారని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!