

ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ఉన్నత విద్య తదితర అవసరాల కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులు కల్పించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను కోరారు. వివిధ దేశాల్లో పార్లమెంట్ల పనితీరుపై అధ్యయనంలో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి సుహాస్ సుబ్రమణ్యం, 11వ డిస్ట్రిక్ట్ ప్రతినిధి జేమ్స్ వాకిన్‌షాలను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను ఏకం చేసి చేపట్టిన ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులను వారికి వివరించారు. అమెరికాలో పార్లమెంటు నిర్వహణ, ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధానాన్ని కూడా వారిని అడిగి తెలుసుకున్నారు.
అమెరికాలో 12 లక్షల మందికి పైగా తెలుగు వారు నివసిస్తున్నారని, వారిలో సుమారు ఆరు లక్షల మంది తెలంగాణకు చెందినవారని రవీందర్‌రావు తెలిపారు. టూరిస్ట్ వీసాల విషయంలో తెలంగాణ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ వారికి వివిధ రకాల వీసాల నిబంధనల్లో సడలింపులు కల్పించే అంశాన్ని కాంగ్రెస్‌లో ప్రస్తావించాలని, అలాగే 1,000 డాలర్ల ఫీజును తగ్గించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనపై వారు సానుకూలంగా స్పందించి, పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ రవీందర్‌రావుతో పాటు సామాజిక విశ్లేషకుడు పులి రవి, డాక్టర్ బిక్షం గుజ్జా పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!