

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య పరస్పర అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునే ‘క్విడ్ ప్రో కో’ అవగాహన ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికే పరిమితమవుతున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతిపై అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేసిన ఆయన తాను ప్రస్తావించిన కేసుల్లో ఇప్పటివరకు అరెస్టులు జరగలేదని ఆరోపించారు.
ఉపాధ్యాయుల సమస్యలపైనా రాంచందర్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో తీసుకొచ్చిన జీఓ 317కు ప్రత్యామ్నాయంగా అమలు చేస్తున్న జీఓ 190ను సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. జీఓ 190 పరిధిలో దాదాపు 4,000 మంది ఉపాధ్యాయులకు బదిలీలు లేదా డిప్యుటేషన్లు రావాల్సి ఉండగా, 100 నుంచి 200 మందికి మాత్రమే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. గాంధీభవన్ వద్ద ఆందోళన చేసిన ఉపాధ్యాయుల అరెస్టులను ఖండించిన ఆయన వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్‌కు ముందే రైతులను ఆదుకునేందుకు ఒక విడత రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశం సందర్భంగా టీవీ నటులు స్వర్ణలత, లక్ష్మణ్, సీనియర్ కెమెరామెన్లు సురేష్, మహేష్ వైభవ్ సూర్య ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!