

పులివెందుల మండలంలో రిజర్వేషన్ల కేటాయింపులో అధికారుల సమన్వయ లోపం వెలుగులోకి వచ్చింది. మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించిన అధికారులు.. అదే మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో ఆ వర్గానికి ప్రత్యేకంగా ఒక్క స్థానాన్ని కూడా రిజర్వు చేయలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంపీపీ పదవిని చేపట్టేందుకు ఎస్టీ వర్గానికి చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధి లేకపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఎంపీపీ పదవిని ఎస్టీలకు కేటాయించి, మరోవైపు ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం అధికారుల నిర్లక్ష్యాన్ని, రిజర్వేషన్ల ఖరారులో సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతోంది.
ఎంపీపీ పదవుల రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో ఖరారు చేయగా.. ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను మండలాల వారీగా రోస్టర్ విధానంలో నిర్ణయించారు. ఈ రెండు ప్రక్రియలు వేర్వేరుగా జరిగినప్పటికీ వాటి మధ్య సమన్వయం సాధించాల్సిన బాధ్యత అధికారులదే. ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరినే ఎంపీపీగా ఎన్నుకుంటారు. కాబట్టి ఎంపీపీ పదవిని ఎస్టీలకు కేటాయించినప్పుడు ఆ వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంపీటీసీ స్థానం ఎస్టీలకు రిజర్వు కాకపోయినా.. జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థి గెలిస్తే ఎంపీపీ పదవికి అర్హత పొందే అవకాశం ఉంటుంది. అలాంటి సభ్యుడు కూడా లేకపోతే ఎంపీపీ ఎన్నిక నిర్వహణపై న్యాయపరమైన, పరిపాలనాపరమైన సందిగ్ధత తలెత్తే అవకాశముంది. రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ చేసే ముందు అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారా? సంబంధిత శాఖల మధ్య సమీక్ష నిర్వహించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!