

తమిళనాడులో రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేసుకుంటున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇప్పుడు కేరళపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేరళలో పార్టీ విస్తరణలో భాగంగా ప్రముఖ మలయాళ నటుడు దేవన్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన దేవన్.. అనంతరం టీవీకే నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. తన ఇంటికి వచ్చిన ఇద్దరు టీవీకే నేతలు సుమారు మూడు గంటల పాటు చర్చించారని, అనంతరం పార్టీ సీనియర్ నేతలతో ఆన్‌లైన్ సమావేశం కూడా జరిగిందని వెల్లడించారు. ఈ చర్చల్లో కేరళ టీవీకే అధ్యక్ష పదవిని చేపట్టాలని తనకు ఆఫర్ చేసినట్లు దేవన్ తెలిపారు.
అయితే టీవీకేలో చేరికపై దేవన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలో చెన్నై వెళ్లి విజయ్‌ను కలిసిన అనంతరం ఈ అంశంపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. సినిమా రోజుల నుంచే విజయ్, దేవన్‌లకు పరిచయం ఉండటంతో ఈ ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్యే ప్రధాన పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందని దేవన్ అభిప్రాయపడ్డారు. కేరళలో విజయ్‌కు భారీ అభిమానగణం ఉండటంతో యువత, విద్యార్థుల్లో టీవీకేకు ఆదరణ లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేవన్ టీవీకేలో చేరితే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ మరింత బలపడే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!