

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్నాయని పేర్కొన్న ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ప్రదర్శించారు. ప్రభుత్వం, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేశాయని ఆరోపించారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణలు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల్లో అక్రమాలు జరిగాయని విమర్శించారు. ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ చేయకుండా అడ్డుకోవడం, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేయడం, పోలింగ్ ఏజెంట్లను బెదిరించడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పలు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా చేశారని జగన్ ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో లోపాలు ఉన్నాయని, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఓట్ల సంఖ్యలో మార్పులు కనిపించాయని విమర్శించారు. పలు జిల్లాల్లో దాడులు, రిగ్గింగ్, ఓటర్లను అడ్డుకోవడం, జర్నలిస్టులపై దాడులు జరిగినట్లు ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును, ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ‘హే రామ్.. సేవ్ ఆంధ్రా.. సేవ్ డెమొక్రసీ’ అంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఒత్తిళ్లు, దాడులు ఎదుర్కొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. చివరగా చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి ఓడిపోయారని, తాము ఓడిపోయినా ప్రజల మనసుల్లో గెలిచామని వ్యాఖ్యానించారు. ఇవన్నీ జగన్ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!