

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారం తొలిరోజే హౌస్‌లో హైడ్రామా కనిపించింది. కంటెస్టెంట్ల మధ్య వరుస గొడవలు, మాటల యుద్ధాలు చోటుచేసుకున్నాయి. నాలుగో వారం కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అపూర్వకు తొలిరోజే ఇబ్బందులు ఎదురయ్యాయి. డిష్ వాషింగ్, కెప్టెన్ రూమ్ ఖాళీ చేయడం వంటి అంశాల్లో ముఖేష్‌తో ఆమెకు వాగ్వాదం జరిగింది. తన నిర్ణయాలను అందరూ పాటించాలంటే ముందుగా మీటింగ్ నిర్వహించాలని ముఖేష్ సూచించడంతో అపూర్వ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే అక్కడ కూడా ఇద్దరి మధ్య వాదన కొనసాగింది. కెప్టెన్‌గా తనను గౌరవించాలని, తనను ‘కెప్టెన్ అపూర్వ’ అని పిలవాలని ఆమె కోరగా.. త్రిగుణ్ అందుకు అభ్యంతరం చెప్పడంతో మరోసారి వివాదం మొదలైంది. మరోవైపు షాలినీ, రోహిత్‌తో అపూర్వ వ్యవహారశైలిపై చర్చించింది. త్రిగుణ్, దేబ్జానీ మధ్య సంభాషణలో మిథిలేష్ ఎగ్జిట్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఆ తర్వాత బిగ్ బాస్ ‘టోటల్ డామినేషన్’ టాస్క్‌ను ప్రారంభించాడు. కంటెస్టెంట్లను ‘సప్తశక్తి’, ‘భైరవ’ అనే రెండు టీమ్‌లుగా విభజించి డ్యాగర్స్, రథ నిర్మాణానికి సంబంధించిన టాస్క్‌లు ఇచ్చారు. నరేష్ వద్ద ఉన్న డ్యాగర్‌ను తీసుకునే ప్రయత్నంలో వివాదం తలెత్తగా.. శ్రిష్టి కాలికి గాయం కావడంతో టాస్క్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. మెడికల్ రూమ్‌కు వెళ్లే ముందు శ్రిష్టి తన డ్యాగర్‌ను షాలినీకి ఇవ్వడంతో దాన్ని తిరిగి తీసుకునే ప్రయత్నం మరో గొడవకు దారితీసింది. ఈ ఘటనపై త్రిగుణ్, రోహిత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ముఖేష్ కాలికి గాయం కావడంతో ఆట మరోసారి ఆగింది. అమన్ ఫౌల్ గేమ్ ఆడాడని షాలినీ ఆరోపించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి టీమ్ భైరవ ఆధిపత్యం సాధించి రథ నిర్మాణంలో తొలి భాగాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకుంది. దీంతో నాలుగో వారం తొలిరోజు గొడవలు, గాయాలు, వ్యూహాలు, ఆధిపత్య పోరుతో ముగిసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!