

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎప్పటికప్పుడు ఊహించని ట్విస్టులు, టర్న్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. షోలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కంటెస్టెంట్లలోనూ ఉత్కంఠను పెంచుతున్నాయి. ఏడో వారంలో ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. ఎనిమిదో వారంలోనూ డబుల్ ఎలిమినేషన్‌ను కొనసాగించాడు. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లిన వారిలో ప్రముఖ ఫోక్ సింగర్ ఝాన్సీ కూడా ఉన్నారు. ఎలిమినేషన్ ప్రక్రియలో సుధీర్‌కు తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో అతడిని బయటకు పంపే పరిస్థితి ఏర్పడింది. అయితే ముకేష్ తన దగ్గరున్న సూపర్ పవర్‌ను ఉపయోగించి ఝాన్సీకి గతంలో లభించిన నామినేషన్ల నుంచి సేవ్ అయ్యే పవర్‌ను తిరిగి అందించాడు. ఆ పవర్‌ను సుధీర్‌ను కాపాడేందుకు ఉపయోగించాలని ఝాన్సీకి షరతు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో తనను తాను కాపాడుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ పవర్‌ను తన దగ్గరే ఉంచుకుని ఉంటే ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్‌లో ఆమె హౌస్‌ను వీడాల్సి వచ్చింది.
ఇక ఝాన్సీ ప్రయాణం విషయానికి వస్తే.. ముందుగా ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్న ఆమె, ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 10లో మెయిన్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. కామనర్‌గా వచ్చినప్పటికీ తన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆమె సేఫ్ గేమ్ ఆడుతున్నారనే విమర్శలు వచ్చినా.. టాస్కుల్లో చూపిన పట్టుదల, తనదైన మాటతీరు, హౌస్‌లో అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసే విధానం ద్వారా గుర్తింపు పొందారు. ఆమె కచ్చితంగా గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుంటారని చాలామంది భావించారు. అలాంటిది ఎనిమిదో వారంలోనే ఎలిమినేట్ కావడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇక పారితోషికం విషయానికొస్తే.. ఝాన్సీకి వారానికి సుమారు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఎనిమిది వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు దాదాపు రూ.5.60 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందినట్లు అంచనా. దీనికి అదనంగా ‘అగ్నిపరీక్ష’ టాస్క్ ద్వారా మరో రూ.50 వేలు లభించినట్లు సమాచారం. అయితే ఈ పారితోషిక వివరాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!