

నటి ఇనయా సుల్తానా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా అవకాశాల కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అవకాశాల కోసం పలువురిని స్వయంగా కలిశానని తెలిపారు. అవసరమైతే చిన్న చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడ్డానని గుర్తుచేసుకున్నారు. తన గత ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ.. తనకు వస్తున్న పేరు, గుర్తింపు, సినిమా అవకాశాలను మాజీ ప్రియుడు తట్టుకోలేకపోయేవాడని చెప్పారు. అతడి అసూయే తమ బ్రేకప్‌కు ప్రధాన కారణమని వెల్లడించారు. ఓ వివాహ వేడుకలో అందరి ముందూ తనను దుర్భాషలాడటంతో ఆ సంబంధానికి ముగింపు పలికినట్లు తెలిపారు. వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పంచుకోవడం తనకు ఇష్టం లేదని, దిష్టి తగులుతుందనే నమ్మకంతో ఫొటోషూట్లను కూడా తగ్గించానని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న సినిమా ప్రాజెక్టుల వివరాలను కూడా సరైన సమయం వచ్చే వరకు వెల్లడించకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
సినిమా రంగంలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, అందుకే ప్రత్యామ్నాయ కెరీర్‌గా రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి పెంచుకున్నానని ఇనయా తెలిపారు. దుబాయ్ పర్యటనలో ఓ స్నేహితుడి ద్వారా ఈ వ్యాపారం గురించి తెలుసుకున్నానని వెల్లడించారు. వ్యక్తిగత జీవితంలో తాను ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని, బాధలో ఉన్నప్పుడు ఇతరులతో విషయాలు పంచుకోవడం కన్నా ఏకాంతంగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఇక బిగ్‌బాస్ షో తర్వాత తన కెరీర్‌లో ఆశించిన మార్పు రాలేదని ఇనయా పేర్కొన్నారు. ఆ షోతో సినిమా అవకాశాలు పెరుగుతాయని భావించినప్పటికీ, అందుకు భిన్నంగా సినిమాల్లో తన పారితోషికం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు లభించినా, అది తప్పనిసరిగా సినిమా అవకాశాలను పెంచుతుందని చెప్పలేమన్నారు. కొంతమంది కంటెస్టెంట్లకు షో తర్వాత ప్రతికూల స్పందన ఎదురవుతుందని, తనకు మాత్రం ప్రేక్షకుల నుంచి సానుకూల ఆదరణ లభించిందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!