

లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028 బెర్తే లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత హాకీ జట్లు అద్భుతమైన శుభారంభం చేశాయి. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు ఉజ్బెకిస్థాన్‌ను 19-0తో చిత్తుగా ఓడించగా.. పురుషుల జట్టు ఇండోనేసియాపై 13-1తో ఘన విజయం సాధించింది. మహిళల జట్టు తరఫున దీపిక అద్భుత ప్రదర్శనతో ఏకంగా ఎనిమిది గోల్స్ చేసింది. ఇషిక హ్యాట్రిక్ సాధించగా, నవ్‌నీత్ కౌర్, లాల్‌తాన్‌త్లుంగి చెరో రెండు గోల్స్ చేశారు. పురుషుల జట్టులో దిల్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్‌తో మెరిశాడు. శిలానంద్, సుఖ్‌జీత్ సింగ్ చెరో రెండు గోల్స్ చేయగా.. అభిషేక్, రాజేందర్, మన్‌దీప్, హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు.
ఇక భారత హాకీ జట్ల జెర్సీలు కూడా తొలి మ్యాచ్‌ల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచకప్ సందర్భంగా కాషాయ రంగు జెర్సీలపై వివాదం నేపథ్యంలో ఆసియా క్రీడల్లో భారత జట్లు సంప్రదాయ నీలం రంగు జెర్సీలతో ఆడతాయని హాకీ ఇండియా గతంలో ప్రకటించింది. అయితే తొలి మ్యాచ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తెలుపు, నీలం, కాషాయ రంగుల కలయికతో కూడిన జెర్సీలతో బరిలోకి దిగాయి. జెర్సీ మార్పుకు గల కారణం స్పష్టంగా తెలియదని హాకీ ఇండియా వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, కార్యదర్శి బోలానాథ్ సింగ్ మధ్య విభేదాల నేపథ్యంలో ఈ మార్పు జరిగి ఉండొచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!