

న్యూఢిల్లీలో జరిగిన 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలను సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తన సత్తాను చాటింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో తామ్ గిక్వెల్–డెల్ఫైన్ డెల్రూ జోడీ ప్రపంచ నంబర్‌వన్ చైనా జంట ఫెంగ్ యాన్ జె, హువాంగ్ డాంగ్ పింగ్‌ను 22-20, 19-21, 21-15తో ఓడించింది. 78 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో నిర్ణాయక గేమ్‌లో ఒత్తిడిని అధిగమించిన ఫ్రెంచ్ జోడీ విజయం సాధించింది. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి ఫ్రెంచ్ జంటగా చరిత్ర సృష్టించింది.
ఆ తర్వాత పురుషుల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల అలెక్స్ లానియెర్ అదరగొట్టాడు. జపాన్ ఆటగాడు కొడై నరఒకను 21-11, 21-11 తేడాతో వరుస గేముల్లో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్షిప్స్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి ఫ్రెంచ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఫ్రాన్స్ ఈ టోర్నీలో కేవలం రెండు కాంస్య పతకాలే సాధించగా, ఇప్పుడు ఒకే రోజు రెండు స్వర్ణాలు సాధించడం ఫ్రెంచ్ బ్యాడ్మింటన్ చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!