

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరోసారి సత్తా చాటింది. వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో దేశ పతకాల సంఖ్యను 11కు చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు పురుషుల 79 కిలోల విభాగంలో మొత్తం 330 కిలోలు ఎత్తి రజత పతకం గెలిచాడు. కేవలం ఒక్క కిలో తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకున్నా, స్నాచ్ విభాగంలో గేమ్స్ రికార్డు నమోదు చేసి తన ప్రతిభను చాటాడు. మరోవైపు పారా అథ్లెటిక్స్ మహిళల ఎఫ్-57 షాట్‌పుట్‌లో షర్మిల ధన్‌ఖడ్ స్వర్ణం సాధించి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తొలి భారత పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అదే ఈవెంట్లో శిల్ప శైలా కాంస్య పతకం సాధించగా, మహిళల 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జీందర్ కౌర్ రజతంతో మెరిసింది.
పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే 2.25 మీటర్ల ఎత్తు దాటి రజత పతకం సాధించి కామన్వెల్త్ క్రీడల హైజంప్‌లో రజతం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సర్వేశ్, తన తండ్రి పొలంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హైజంప్ పిట్లో సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి చేరడం ఎంతో స్ఫూర్తిదాయకం. మరోవైపు స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్, ఆర్యన్ నెహ్రా ఫైనల్స్‌లో ఎనిమిదో స్థానాలతో ముగించగా, శ్రీహరి నటరాజ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. గాయమైనప్పటికీ పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్‌ను పూర్తి చేసిన తేజాస్ షిర్సే పోరాటస్ఫూర్తి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!