

భారత మహిళల క్రికెట్‌ను మరింత బలోపేతం చేయాలంటే రాష్ట్ర, ప్రాంతీయ స్థాయి టీ20 లీగ్‌లను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మాజీ భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్‌తో పాటు భారత జట్టు భవిష్యత్‌పై ఆమె పలు కీలక అభిప్రాయాలు వెల్లడించారు. ఆసియా క్రీడలు యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి వేదికగా నిలుస్తాయని చెప్పారు. కమలిని, ప్రేమ రావత్ ఇప్పటికే తమ సామర్థ్యాన్ని చాటుకున్నారని, అంతర్జాతీయ స్థాయిలో భిన్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఇలాంటి టోర్నీల ద్వారా నేర్చుకుంటారని పేర్కొన్నారు. జట్టు సంధి దశలో ఉన్నప్పుడు అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండటం ఉపయోగకరమని, అయితే ఆటగాళ్ల బాధ్యతలను స్పష్టంగా నిర్వచిస్తే కెప్టెన్సీని విభజించడం కూడా సమస్య కాదని తెలిపారు. హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాతి సారథిని ముందుగానే సిద్ధం చేయాలని, నాయకత్వ మార్పు సాఫీగా జరిగేలా ముందస్తు ప్రణాళిక అవసరమని మిథాలీ సూచించారు.
ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం సాధించాలంటే భారత జట్టు ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో మరింత మానసిక దృఢత్వం, నిలకడ ప్రదర్శించాలని మిథాలీ అన్నారు. ప్రతిభకు కొదవలేదని, కానీ మ్యాచ్ మన ప్రణాళికలకు భిన్నంగా సాగినప్పుడు ప్రశాంతంగా స్పందించి ఫలితాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడం కీలకమని చెప్పారు. షెఫాలీ వర్మ, రిచా ఘోష్ భవిష్యత్‌లో సూపర్‌స్టార్లుగా ఎదిగే సామర్థ్యం ఉన్నవారిగా పేర్కొంటూ.. యువ క్రికెటర్లకు తప్పులు చేసినా నేర్చుకునే స్వేచ్ఛ కల్పించాలని సూచించారు. డబ్ల్యూపీఎల్ ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించలేనందున రాష్ట్ర, ప్రాంతీయ లీగ్‌లు ఎంతో అవసరమని మిథాలీ వివరించారు. ఈ లీగ్‌లు దేశవాళీ క్రికెట్, డబ్ల్యూపీఎల్‌కు వారధిగా పనిచేస్తాయని చెప్పారు. నాలుగు ఫ్రాంఛైజీలతో ప్రారంభమైన మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి ప్రొఫెషనల్ క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మహిళల క్రికెట్ బలపడితే.. భవిష్యత్‌లో భారత జట్టు కూడా మరింత పటిష్ఠమవుతుందని మిథాలీ అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!