

యూఎస్ ఓపెన్ 2026లో స్టార్ ప్లేయర్ల ఆట కంటే ఇతర అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్లూయెన్సర్లు, కొందరు ప్రేక్షకుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెన్నిస్‌కు మరింత ప్రచారం కల్పించేందుకు కంటెంట్ క్రియేటర్లకు నిర్వాహకులు మీడియా యాక్సెస్ పెంచారు. అయితే, కోర్టులో నిశ్శబ్ద వాతావరణానికి భంగం కలిగించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒసాకా–జఖరోవా మ్యాచ్ సందర్భంగా కొందరు కంటెంట్ కోసం శక్తిమంతమైన రింగ్ లైట్లు వినియోగించడం విమర్శలకు దారితీసింది. అలాగే రోజర్ ఫెదరర్ పాల్గొన్న ఎగ్జిబిషన్ మ్యాచ్‌లోనూ కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు పెద్దగా మాట్లాడటం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించినట్లు సమాచారం. గతేడాది 54 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు మీడియా క్రెడెన్షియల్స్ ఇవ్వగా.. ఈసారి ఆ సంఖ్య 100 దాటింది. ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కంటెంట్ క్రియేటర్ల తీరు ఇబ్బందికరంగా ఉందని టెన్నిస్ స్టార్ జెస్సికా పెగులా ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు న్యూయార్క్‌లోని టోర్నీ వేదిక పరిసరాల్లో కొందరు ప్రేక్షకుల అతిగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం కూడా చర్చకు దారితీస్తోంది. దీనివల్ల ఆటగాళ్లు, ఇతర ప్రేక్షకులకు అసౌకర్యం కలుగుతోందనే కథనాలు వెలువడ్డాయి. యూఎస్ ఓపెన్‌లో ప్రముఖమైన ‘హనీ డ్యూస్’ కాక్‌టెయిల్‌కు కూడా భారీ డిమాండ్ కొనసాగుతోంది. టోర్నీ ఇంకా పలు రోజులపాటు కొనసాగనున్న నేపథ్యంలో మద్యం మత్తులో ప్రేక్షకులు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించే అవకాశాలపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటపై ఏకాగ్రతకు భంగం కలగకుండా, టోర్నీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!