

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కుమారుడు హసన్ ఈసాఖిల్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్-11, ఉజ్బెకిస్థాన్ మధ్య జరిగిన అనధికారిక టీ20 మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన శతకాలలో ఒకదాన్ని నమోదు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హసన్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ, కేవలం 34 బంతుల్లో 120 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 16 సిక్సర్లు ఉండగా, 352.94 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అయితే అసౌకర్యం కారణంగా మధ్యలో రిటైర్డ్ అవుట్ అయ్యాడు.
హసన్ ఈసాఖిల్, కెప్టెన్ ఇమ్రాన్ మీర్తో కలిసి తొలి వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆఫ్ఘనిస్థాన్-11 జట్టు 20 ఓవర్లలో 323/7 భారీ స్కోరు నమోదు చేసింది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను చాటుకున్న హసన్, 4 ఫస్ట్‌క్లాస్, 14 లిస్ట్-ఏ, 38 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు నమోదు చేసిన ఈ యువ ఆటగాడు ఇటీవల భారత్, శ్రీలంకలతో జరిగిన ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్-ఏ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. తన కుమారుడితో కలిసి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న మహ్మద్ నబీ కల త్వరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!