

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు తన పేరును అనుమతి లేకుండా ఉపయోగించడంపై భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న వ్యక్తిగా తన పేరును ప్రచారంలోకి తీసుకొచ్చారని, అయితే ఇందుకు తాను అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తన లీగల్ టీమ్ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అనధికారిక సమాచారాన్ని నమ్మే ముందు జాగ్రత్తగా ఉండాలని మీడియా ప్రతినిధులు, అభిమానులకు ఎక్స్ వేదికగా సూచించారు.
గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్న ఆసియా వారియర్స్ జట్టుకు శిఖర్ ధావన్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు టోర్నీ నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ధావన్ తాజా ప్రకటన నేపథ్యంలో నిర్వాహకులు మరోసారి స్పందించారు. షెడ్యూల్ సమస్యలు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ధావన్ ఈ టోర్నీలో ఆడటం లేదని వెల్లడించారు. ఆటగాళ్ల అనుమతి లేకుండా వారి పేర్లను ప్రకటించడంపై ఈ పరిణామం చర్చకు దారితీసింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!