

ఆరు జట్లతో వచ్చే ఏడాది నిర్వహించనున్న తొలి మహిళల చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి మరో వేదికకు తరలించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైనట్లు సమాచారం. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)లో కొనసాగుతున్న పాలనా సమస్యలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2023-24లో శ్రీలంకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో పాటు క్రికెట్ బోర్డులో అవినీతి ఆరోపణలు, పరిపాలనా అవకతవకల నేపథ్యంలో ఐసీసీ కొంతకాలం ఎస్‌ఎల్‌సీని సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి బోర్డుకు పూర్తిస్థాయి ఎన్నికైన పాలక మండలి లేకపోగా.. ప్రభుత్వం నియమించిన తాత్కాలిక ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
జాతీయ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ అనుమతించదు. బోర్డుకు ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయి పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఐసీసీ సూచించినప్పటికీ.. శ్రీలంక క్రీడాశాఖ ఆ సూచనలను పట్టించుకోలేదని సమాచారం. దీంతో మహిళల చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షఫ్తెర్ స్పందిస్తూ.. టోర్నీ శ్రీలంక నుంచి తరలిపోయే అవకాశం ఉందని, మరో వేదికలో నిర్వహించనున్నారని తెలిపారు. అయితే కొత్త వేదిక ఏదనేది ప్రస్తుతం వెల్లడించలేమని పేర్కొన్నారు. దీంతో మహిళల తొలి చాంపియన్స్ ట్రోఫీకి కొత్త ఆతిథ్య దేశం ఎంపికపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!