

టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అభిమానుల నుంచి ఎదురైన విమర్శలు, ఆన్‌లైన్ ద్వేషంపై తాజాగా స్పందించాడు. నాలుగేళ్ల క్రితం శుభ్‌మన్ గిల్‌ను కాదని కేకేఆర్ అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. 2025 సీజన్ కోసం ఏకంగా రూ.23.75 కోట్లు వెచ్చించింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ గిల్‌ను రూ.8 కోట్లకు తీసుకోగా.. అతడు ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే అయ్యర్ మాత్రం తనపై ఫ్రాంచైజీ పెట్టుకున్న భారీ అంచనాలను అందుకోలేకపోయాడు. గిల్ సెంచరీ చేసినా, భారీ స్కోర్లు సాధించినా కేకేఆర్ అభిమానులు తనను సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకుని విమర్శించేవారని అయ్యర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కొన్నిసార్లు ఆ వ్యాఖ్యలు తీవ్ర స్థాయికి చేరేవని ఆవేదన వ్యక్తం చేశాడు.
చాలాకాలం పాటు తాను తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నానని, ఇప్పటికీ కొందరు విమర్శలు చేస్తూనే ఉన్నారని అయ్యర్ తెలిపాడు. ‘బంగారం కోసం వెతుకుతూ వజ్రాన్ని పోగొట్టుకున్నాం’ అంటూ అభిమానులు కామెంట్లు చేసేవారని గుర్తుచేసుకున్నాడు. కేకేఆర్‌ను విడిచి వెళ్లడం తనను ఎప్పుడూ బాధించే విషయమని, ఆ జట్టు యజమాని షారుక్ ఖాన్‌తో కూడా మాట్లాడినట్లు వెల్లడించాడు. అయితే తనకు ఎదురైన సమస్యకు డబ్బు కారణం కాదని, తాను ఆశించిన విధంగా పరిస్థితులు సాగడం లేదని అప్పటికే భావించినట్లు చెప్పాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడుతున్న అయ్యర్.. అక్కడి అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఇతర జట్లతో పోలిస్తే ఆర్‌సీబీ అభిమానుల అభిమానం, ఫ్యాన్‌డమ్ ప్రత్యేకంగా ఉంటాయని పేర్కొన్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!