

కృత్రిమ మేధ ద్వారా రూపొందిన కంటెంట్‌ను గుర్తించేందుకు ఏఐ సంస్థలు డిజిటల్ వాటర్‌మార్కింగ్ వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే మరోవైపు డెవలపర్లు ఈ అదృశ్య గుర్తులను తప్పించుకునే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. భవిష్యత్ క్లాడ్ మోడళ్ల ద్వారా రూపొందే కంటెంట్‌కు మెషిన్-రీడబుల్ వాటర్‌మార్క్‌లను జోడించనున్నట్లు ఆంథ్రపిక్ ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ ఏఐ చట్టంలోని ఆర్టికల్ 50(2) పారదర్శకత నిబంధనలను పాటించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.
క్లాడ్ వాటర్‌మార్కింగ్ విధానం గూగుల్ డీప్‌మైండ్ అభివృద్ధి చేసిన SynthID-Text పరిశోధనపై ఆధారపడి ఉంది. మనుషులకు కనిపించని విధంగా పదాలు, టోకెన్ల ఎంపికలో ఒక నిర్దిష్ట నమూనాను సృష్టించి, ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ ద్వారా దాన్ని గుర్తించేలా ఈ సాంకేతికత పనిచేస్తుంది. దీనివల్ల కంటెంట్ అర్థం, చదవడానికి అనువుగా ఉండటం లేదా నాణ్యతపై ప్రభావం ఉండదని ఆంథ్రపిక్ చెబుతోంది.
అయితే వాటర్‌మార్కింగ్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే దాన్ని తప్పించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. డెవలపర్ గిలామ్ మేయర్ ఇతర వాటర్‌మార్క్ లేని ఏఐ మోడళ్ల సహాయంతో కంటెంట్‌ను తిరిగి రాయడం ద్వారా గుర్తులను తొలగించేందుకు ఓపెన్-సోర్స్ టూల్‌ను రూపొందించారు. మరికొందరు డెవలపర్లు వాక్యాల క్రమాన్ని మార్చడం, పదాలను మార్చడం, అనువాదం ద్వారా కంటెంట్‌ను పునర్నిర్మించడం వంటి మార్గాలను పరీక్షిస్తున్నారు. అయితే ఆంథ్రపిక్ అధికారిక డిటెక్షన్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రానందున ఈ పద్ధతులు ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయో స్పష్టంగా తెలియదు.
ఇక ఏఐ వాటర్‌మార్కింగ్‌పై మరో ప్రధాన ఆందోళన తప్పుడు గుర్తింపులపై ఉంది. కంటెంట్‌ను క్లాడ్ ప్రాసెస్ చేసి ఉండే అవకాశం ఉందని మాత్రమే వాటర్‌మార్క్ సూచిస్తుందని ఆంథ్రపిక్ తెలిపింది. క్లాడ్ పూర్తిగా కంటెంట్‌ను రాసిందా, కేవలం ఎడిట్ చేసిందా లేదా మరో ఏఐ మోడల్ రూపొందించిందా అనే విషయాన్ని అది నిర్ధారించదు. అందువల్ల ఏఐ డిటెక్షన్‌పై అతిగా ఆధారపడితే విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగార్థులు అన్యాయంగా నష్టపోయే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!