

మొబైల్ యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం సైబర్ నేరాలకు ఎలా కారణమవుతుందో హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. నగర పరిధిలో ఓ విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో మూడు రోజుల పాటు ఇంటికే పరిమితం చేసిన సైబర్ నేరగాళ్లు, కుటుంబసభ్యులను జైలుకు పంపుతామని బెదిరించి సుమారు రూ.1.5 కోట్లు కాజేశారు. మరో ఘటనలో ఓ గృహిణి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన సెల్‌ఫోన్‌కు ఖరీదైన కారు బహుమతిగా వచ్చిందంటూ నమ్మించి రూ.2 లక్షలు దోచుకున్నారు. ఈ తరహా మోసాల్లో ఆధార్ నంబర్లు, మొబైల్ వివరాలు, ఆన్‌లైన్ కొనుగోళ్ల సమాచారం కీలకంగా మారుతున్నాయి. ఓ ప్రైవేటు సంస్థ పరిశీలన ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే పలు యాప్‌లు 32 రకాల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించారు. ఫోన్ నంబర్లు, ఆరోగ్య వివరాలు, ఆర్థిక సమాచారం, లొకేషన్, బ్రౌజింగ్ హిస్టరీ, కొనుగోళ్లు, యాప్ వినియోగ వివరాలు వంటి డేటా మూడో వ్యక్తుల చేతుల్లోకి చేరే ప్రమాదం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు సుమారు 10 నుంచి 15 సైబర్ నేరాల కేసులు నమోదవుతున్నట్లు, బాధితులు రోజుకు దాదాపు రూ.2 కోట్ల వరకు నష్టపోతున్నట్లు అంచనా. బాధితుల్లో విద్యావంతులు, ఉద్యోగులు కూడా అధికంగా ఉంటున్నారు. ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలను ముందుగానే తెలుసుకున్న మోసగాళ్లు నమ్మకంగా మాట్లాడి బాధితులను తమ వలలోకి లాగుతున్నారు. ఫుడ్ డెలివరీ, షాపింగ్, డేటింగ్, పేమెంట్స్, విమాన టికెట్ల బుకింగ్, మెసేజింగ్, వీడియో కాల్స్, ఓటీటీ స్ట్రీమింగ్, వ్యక్తిగత ఆర్థిక సేవలు, జీపీఎస్ నావిగేషన్ వంటి యాప్‌లలో డేటా సేకరణపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. యాప్‌లను డౌన్‌లోడ్ చేసే ముందు వాటి గోప్యతా విధానాలను పరిశీలించాలి. అలాగే లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్ అనుమతులను తనిఖీ చేసి, అవసరం లేని వాటిని నిలిపివేయాలి. వ్యక్తిగత సమాచారాన్ని పరిమితంగా పంచుకోవడం ద్వారా సైబర్ మోసాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!