

డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగవద్దని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకు ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. ఐదు రోజుల పని విధానం అమలు సహా పలు డిమాండ్లతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల రెండు ప్రధాన డిమాండ్లలో ఒకటైన పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసిందని, ఐదు రోజుల పని విధానంపై ఇంకా పరిశీలన కొనసాగుతోందని ఆర్థిక శాఖ తెలిపింది.
సమ్మె జరిగితే ముందున్న వారాంతపు సెలవులతో కలిపి బ్యాంకింగ్ సేవలకు వరుసగా ఐదు రోజులపాటు అంతరాయం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. సెప్టెంబర్ 30న అర్ధవార్షిక ఖాతాల ముగింపు కూడా ఉండటంతో వినియోగదారులు, వ్యాపారాలు, ప్రభుత్వ లావాదేవీలపై ప్రభావం పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులను ఆర్థిక శాఖ కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!