

ఇ20 పెట్రోల్ విధానాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్, వాహన తయారీ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ARAI, SIAM తదితర సంస్థలతో విస్తృతంగా చర్చించి శాస్త్రీయంగా ఆమోదించిన తర్వాతే అమలు చేశామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి E0, E10, E20 ఇంధనాలను అందుబాటులో ఉంచడం వల్ల రవాణా, నిల్వ, నిర్వహణ పరంగా భారీ సమస్యలు తలెత్తుతాయని కూడా వివరించారు.
మైలేజీపై వస్తున్న సందేహాలకు స్పందించిన కేంద్రం, E10 వాహనాల్లో ఇ20 వినియోగంతో 3 నుంచి 5 శాతం వరకు మైలేజీ తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అధిక ఆక్టేన్ కారణంగా మెరుగైన యాక్సిలరేషన్ లభిస్తుందని తెలిపింది. దేశంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ ఇంధనాన్ని వినియోగిస్తున్నప్పటికీ, ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడంతో పాటు ముడి చమురు దిగుమతులు, కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గాయని కేంద్రం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!